గుంటూరు, నవంబర్ 24:– మంగళగిరి కార్పొరేషన్, పొన్నూరు మున్సిపాలిటీ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పూనేఠ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాల నిఘా ఉండేలా చూడాలని, గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన మేర అదనపు టేబుళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత జడ్పీ ఎన్నికల వేళ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసినా.. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని ఈ సందర్భంగా ఎస్ఈసీ అభినందించారు.Chandana Brothers Dasaravali Guntur
గుంటూరు కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ సాయికాంత్ వర్మ.. మంగళగిరి కార్పొరేషన్, పొన్నూరు మున్సిపాలిటీలలో చేపట్టిన ఏర్పాట్లను కమిషనర్‌కు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా సాగేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో అదనపు టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఎన్.ఎస్.కె. ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.



