Guntur District City news :ఏపీకి వర్షాల ముప్పు- వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. మత్స్యకారులకు హెచ్చరిక

Sharat
1 View

అమరావతి:-బంగాళాఖాతంలో ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. పశ్చిమమధ్య, దానికి ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉందని, బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.Amaravathi City News

రోజువారీ వర్ష సూచన వివరాలు:

  • మంగళవారం (సెప్టెంబర్ 22): అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • బుధవారం (సెప్టెంబర్ 23): అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా.
  • గురు, శుక్రవారాల్లో: కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి.

మత్స్యకారులకు తీవ్ర హెచ్చరిక:

వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్రం తీవ్ర అలజడిగా మారి రాకాసి అలలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం:

సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి పలు జిల్లాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది:

  • శంఖవరం (కాకినాడ): 60.7 మి.మీ
  • నందలూరు (ఎన్టీఆర్ జిల్లా): 52.5 మి.మీ
  • పెద్దాపురం (కాకినాడ): 48.2 మి.మీ
  • దుర్వేసి (నంద్యాల): 45.5 మి.మీ
  • కవులూరు (ఎన్టీఆర్ జిల్లా): 45.3 మి.మీ
  • రామకుప్పం (చిత్తూరు): 39.3 మి.మీ
  • డి.హీరేహాల్ (అనంతపురం): 35.5 మి.మీ
  • పత్తికొండ (కర్నూలు): 31.5 మి.మీ
Author
Share This Article
Leave a review