హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రదర్శనగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కోర్సులు పూర్తి చేసిన సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదని తెలిపారు. సర్టిఫికెట్లు అందకపోవడంతో విద్యార్థులు ఉద్యోగాలు, ఉన్నత విద్యలో చేరేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఫీజుల సమస్య కారణంగా పేద, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆర్.కృష్ణయ్య అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పాత విధానంలోనే కొనసాగించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.Hyderabad city news
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఫీజు బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు విద్యార్థుల పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, సి. రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.



