చీరాల, అక్టోబర్ 3:– చీరాల మున్సిపాలిటీలో పునర్విభజన అనంతరం రూపొందించిన 44 వార్డుల హద్దులు, ఓటర్ల జాబితాలో ఉన్న అసమానతలను సమగ్రంగా పరిశీలించి సరిచేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ డాక్టర్ పి. వినోద్ కుమార్, చీరాల మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ డానియేలు జోసెఫ్‌ను శనివారం కలిసి సమస్యలను వివరించారు.
గతంలో చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా, జనాభా పెరుగుదల, పరిపాలనా అవసరాల నేపథ్యంలో ప్రస్తుతం 44 వార్డులుగా పునర్విభజన చేసిన విషయం తెలిసిందే. నూతన వార్డు హద్దుల ఆధారంగా రూపొందించిన ఓటర్ల జాబితాను పరిశీలించినప్పుడు కొన్ని ప్రాంతాల్లో వాస్తవంగా ఒక వార్డులో నివసిస్తున్న ఓటర్ల పేర్లు ఇతర వార్డుల జాబితాల్లో నమోదైనట్లు, అలాగే ఇతర వార్డు పరిధిలో నివసిస్తున్న కొంతమంది ఓటర్లు సంబంధిత వార్డు జాబితాలో నమోదైనట్లు గుర్తించినట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రత్యేకంగా తమ వార్డులో నివసిస్తూ ఇతర వార్డుకు వెళ్లిన ఓటర్లు, ఇతర వార్డులో నివసిస్తూ తమ వార్డులో నమోదైన ఓటర్ల వివరాలను రెండు విభాగాలుగా గుర్తించి, అవసరమైన ఆధారాలతో అధికారులకు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.Bapatla District City News
అదేవిధంగా ఒకే వీధి లేదా ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలు వేర్వేరు వార్డుల్లోకి వెళ్లిన సందర్భాలను కూడా పరిశీలించాలని కోరారు. వార్డు హద్దులు, వీధులు, ఇళ్ల వివరాలు, ఓటర్ల జాబితాలను పరస్పరం సమన్వయం చేసి పరిశీలిస్తే ఇలాంటి అసమానతలను గుర్తించి సరిచేయవచ్చని పేర్కొన్నారు.
వాస్తవ నివాస ప్రాంతానికి అనుగుణంగా ప్రతి ఓటరు పేరు సరైన వార్డు పరిధిలో నమోదైందా లేదా అనే అంశంపై అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలన, ఇంటింటి ధృవీకరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అభ్యంతరాలు ఉన్న ఓటర్లకు నిబంధనల ప్రకారం తమ అభ్యంతరాలను సమర్పించే అవకాశం కల్పించి, వాటిని సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
తుది ఓటర్ల జాబితా ప్రకటించే ముందు వార్డు హద్దులు, వాస్తవ నివాస ప్రాంతాలకు అనుగుణంగా అవసరమైన సవరణలు చేపట్టాలని కోరారు. దీనివల్ల భవిష్యత్తులో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాపిశెట్టి సురేష్, దాసరి శ్రీను, షేక్ సిరాజ్, కనపర్తి బజ్జి బాబు, దేవరపల్లి బాబారావు, నూనె చంద్ర, గుండాల వసంతరావు, మేరుగ ఇస్సాకు, షేక్ రహిమాన్, కాగిత కిషోర్, భట్టిప్రోలు శంకర్, దుడ్డు కోటేశ్వరరావు, కుంచాల రాంబాబు, బడుగు సువర్ణరాజ్, చదలవాడ మాధవరావు, చెంబేటి చంద్ర, ఎస్.డి. షరీఫ్, విన్నకోట రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.



