- ప్రత్తి రైతులు విధిగా బీమా చేసుకోవాలి
- ప్రత్తి, అరటికి పంట బీమా ప్రీమియం చెల్లించుటకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు పెంపు
గుంటూరు, జూలై 20 : పంటల బీమాలో రైతులు నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. పంటల బీమా పోస్టర్ ను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విడుదల చేశారు. పండు మిరప, మినిము పంటలకు జూలై 31వ తేదీలోగా, వరి పంటకు ఆగస్టు 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని అన్నారు. ప్రత్తి, అరటికి పంట బీమా ప్రీమియం చెల్లించుటకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు పెంచారని జాయింట్ కలెక్టర్ చెప్పారు. ఎల్ నినో వంటి ప్రభావం ఉన్నందున ప్రత్తి రైతులు విధిగా బీమా చేసుకోవాలని సూచించారు
వరి, పండు మిరప, మినిము పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద, పత్తి, అరటి పంటలు పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు. వరికి గ్రామం యూనిట్ గా, మినిముకు జిల్లా యూనిట్ గా, పత్తి, అరటి, పండు మిరప పంటలకు మండలం యూనిట్ గా పరిగణించడం జరుగుతుందని అన్నారు.
వరి పంటకు మొత్తం ప్రీమియం రూ.2 వేలు కాగా రైతు తన వాటాగా రూ.8 వందలు చెల్లించాలని చెప్పారు. పండు మిరపకు మొత్తం ప్రీమియం రూ.6,750 కాగా రైతు తన వాటాగా రూ.2,700 చెల్లించాలని, మినుముకు
మొత్తం ప్రీమియం రూ.5 వందలు కాగా రైతు తన వాటాగా రూ.2 వందలు చెల్లించాలని, పత్తికి మొత్తం ప్రీమియం రూ.4,750 కాగా రైతు తన వాటాగా రూ.1,900 చెల్లించాలని, అరటికి మొత్తం ప్రీమియం రూ.6,875 కాగా రైతు తన వాటాగా రూ.2,750 చెల్లించాలని చెప్పారు.
పంటల బీమాలో రైతులు నమోదు చేసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2026 – 27 సంవత్సరానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మరియు పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (RWBCIS) అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుకు జెనరలి సెంట్రల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని,
పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు ఐ.ఎఫ్.ఎఫ్.సి.ఓ – టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రభుత్వం నియమించిందని చెప్పారు.
అర్హులైన రైతులు తమ సాగు చేసిన నోటిఫైడ్ పంటలకు, వర్తించే పథకం ప్రకారం నిర్ణీత గడువులోగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వర్షాభావం, అధిక వర్షాలు, ఇతర పథక నిబంధనల ప్రకారం సంభవించే పంట నష్టాలకు ఆర్ధిక రక్షణ కల్పించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశ్యం అని వివరించారు.
రైతులు తమ సమీప వ్యవసాయ శాఖ కార్యాలయం, రైతు సేవా కేంద్రాలు, బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), కామన్ సర్వీస్ సెంటర్లు (CSCs) లేదా సంబంధిత అమలు బీమా కంపెనీ ప్రతినిధులను సంప్రదించి పంటల బీమాలో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. పంటల బీమా మార్గదర్శకాలు, రైతు ప్రీమియం రేట్లు, నోటిఫైడ్ పంటలు, అమలు బీమా కంపెనీల వివరాలు, నమోదు గడువుకు సంబంధించిన పూర్తి సమాచారం సంబంధిత మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాలలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.
పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు,
పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ
మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ టి. నరసింహా రెడ్డి పాల్గొన్నారు.



