దర్శి:- ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో దర్శి సాంస్కృతిక, సాహిత్య వేదిక నూతన కమిటీ సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక గౌరవ అధ్యక్షుడు పాలుట్ల వల్లికుమార్ మాట్లాడుతూ తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన మహనీయులను స్మరించుకోవడం, వారి సేవలను భావితరాలకు పరిచయం చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సమావేశంలో వేదిక సభ్యులందరూ కలిసి తాత్కాలికంగా అడహాక్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పాలుట్ల వల్లికుమార్, అధ్యక్షుడిగా తురిమెళ్ల శ్రీనివాసప్రసాదశర్మ, ప్రధాన కార్యదర్శిగా కపురం శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడిగా అట్లూరి రామారావు, సంయుక్త కార్యదర్శిగా సూరె నాగచెంచు సుబ్బారావు, కోశాధికారిగా వాడపల్లి వెంకటేశ్వరరావును ఎంపిక చేశారు. గౌరవ సలహాదారులుగా కాకర్ల రఘురామయ్య, పున్నావజ్జుల శ్రీధర్లను ఎన్నుకున్నారు.
రాబోయే రోజుల్లో దర్శి నియోజకవర్గ పరిధిలోని కళాకారులను గుర్తించి, వారిలోని ప్రతిభను సమాజానికి పరిచయం చేయడంతో పాటు వారికి తగిన గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామని వల్లికుమార్ తెలిపారు. తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళలను ప్రోత్సహించే కార్యక్రమాలను వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.



