Prakasam District City News :దర్శిలో ఘనంగా ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు-కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ.. కలశాల ప్రదర్శనతో వైభవంగా అమ్మవారి ఊరేగింపు

S Sarath
1 View

దర్శి:– ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని వివిధ దేవస్థానాల్లో నిర్వహించిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ముగిశాయి. దర్శి పురపాలక సంఘ పరిధిలోని అద్దంకి రోడ్డులో ఉన్న ఎన్ఎస్‌పీ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకుని తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

ఈ సందర్భంగా వేద పండితులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చిలకపాటి బాలకృష్ణమాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

రాత్రి వేళ అమ్మవారి కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అర్చకులు బాలకృష్ణమాచార్యులు కలశాలను భక్తులకు అందజేయగా, భక్తులు వాటిని తలపై ధరించి దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.Prakasam Dist News

అనంతరం అమ్మవారి విగ్రహానికి గుమ్మడికాయతో దిష్టి తీసి, కొబ్బరికాయలు కొట్టి హారతులు సమర్పించారు. డీజే సంగీతం, అమ్మవారి భక్తిగీతాలు, భక్తుల నృత్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా సాగింది. శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Author
Share This Article
Leave a review