Amaravathi Local News :తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక దృష్టి.. రవాణా శాఖలో అనవసర నిబంధనల తొలగింపునకు ఆదేశాలు

Sharat
1 View

అమరావతి, ఆగస్టు 3 :– రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో నెలకొంటున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సోమవారం వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు వివరించగా, కృష్ణానదిలో ఇటీవల ప్రవాహాలు ప్రారంభమైన విషయాన్ని కూడా వెల్లడించారు. గోదావరి నదిలో నెలకొన్న వరద పరిస్థితిపై కూడా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి, కృష్ణా బేసిన్‌కు ఎగువ నుంచి వచ్చే వరద జలాలను సమర్థవంతంగా వినియోగించేలా నీటి నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటూ, పశుసంవర్థక శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అలాగే మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించి, ల్యాబ్ పరీక్షల ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యటిస్తూ అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

రవాణా శాఖలో పూర్తిస్థాయి సాంకేతికత వినియోగం, సేవల సరళీకరణ, అనవసర నిబంధనల తొలగింపుపై చేపడుతున్న చర్యలను అధికారులు సమావేశంలో వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం అమలు, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లు, ఫారం-5బీ వంటి పరీక్షల రద్దు ద్వారా అవినీతిని తగ్గించడంతో పాటు ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

రవాణా శాఖలో ఈ సంస్కరణలను దశలవారీగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించగా, ప్రజలకు ఇబ్బందులు కలిగించే అనవసర నిబంధనలను సాధ్యమైనంత మేర తొలగిస్తూ సేవలను మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

సమీక్ష సమావేశంలో ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review