GUNTUR DISTRICT NEWS: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. లక్ష్య సాధనకు కష్టపడాలి

Karthik

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంగళగిరి గ్రామీణ సీఐ చిరుమామిళ్ల వెంకట్ సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిసై విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోకుండా, విద్యపై దృష్టి సారించి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని ఆయన ఆకాంక్షించారు. మంగళగిరి గ్రామీణ పోలీసుల ఆధ్వర్యంలో ఆత్మకూరులోని వి.జె. డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగం, ఈవ్‌టీజింగ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను, కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. చెడు స్నేహాలు, వ్యసనాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులు, అధ్యాపకుల సూచనలను పాటించాలని సూచించారు.విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఈ దశలో ఏర్పరచుకునే అలవాట్లు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా కష్టపడి చదవాలని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు.అదేవిధంగా మహిళలు, బాలికలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఐ వెంకట్ తెలిపారు.ఈవ్‌టీజింగ్, మహిళలను వేధించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, మత్తు పదార్థాల విక్రయాలు లేదా మహిళలను వేధించే ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత తమ శక్తి, సమయాన్ని సద్వినియోగం చేసుకుని విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, ఉపాధి అవకాశాల వైపు మళ్లాలని ఆయన సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, కళాశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సీఐ చిరుమామిళ్ల వెంకట్ ఆకాంక్షించారు.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review