GUNTUR DISTRICT NEWS: నగదు రహిత వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

Karthik

ఎన్.టి.ఆర్ వైద్యసేవ, ఇ.హెచ్.ఎస్ క్రింద నగదు రహిత వైద్యం అందేలా అన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. అత్యవసర సేవలకు వైద్యులు తప్పని సరిగా అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. ఇ.హెచ్.ఎస్ పథకం కింద ఉద్యోగులు, పింఛనుదారులు నెట్వర్క్ ఆసుపత్రులకు వచ్చినప్పుడు వైద్య సేవలు తిరస్కరించకుండా తగిన వైద్యం సకాలములో అందించాలని అన్నారు. ఆసుపత్రుల మీద వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి విచారించి నివేదిక అందించాలని ఆదేశించారు.డా.ఎన్.టి.ఆర్. వైద్యసేవ పథకం కింద ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో  వైద్య సేవలు పొందే రోగులకు మందులు, పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి అనుసంధానమైన కేంద్రాలకు మాత్రమే పంపించాలని స్పష్టం చేశారు. రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయాలని, ఉచితంగా మందుల పంపిణీ జరగాలని ఆదేశించారు. కొరత ఉన్న మందులను ముందుగానే సి.డి.ఎస్ నుంచి పొందాలని, రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మందుల సరఫరా చేయాలని ఆదేశించారు. డా.ఎన్.టి.ఆర్. వైద్యసేవ పథకం క్రింద ఆసుపత్రుల్లో చేరిన రోగుల నుండి వైద్య పరీక్షలకు గాని, మందులకు గాని, చికిత్సకు డబ్బులు అడిగినట్లు పిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, డా. ఎస్.టి.ఆర్. వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డా. సి. హెచ్.విజయ ప్రకాష్, సభ్యులు రెడ్ క్రాస్ చైర్మన్ పి.రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review