మున్సిపాలిటీలు, ఎం.పీ.టీ.సీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఒకే సిబ్బందిని వినియోగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలు మూడు ఎన్నికలకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. సిబ్బంది మూడు విధులు నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్నికల విధులకు గైర్హాజరు అయ్యే ఉద్యోగుల పట్ల ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులను సస్పెన్షన్ చేయడం జరిగిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సున్నిత, అతిసున్నిత పోలింగ్ కేంద్రాలపై పూర్తి స్పష్టత ఉండాలని అన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల రూట్ లపై పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు రెవిన్యూ డివిజనల్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాలెట్ పెట్టెలను పోలింగ్ కేంద్రాల వారీగా స్టిక్కర్లు అతికించాలని స్పష్టం చేశారు. ప్రవర్తనా నియమావళి పాటించాలని, సింగిల్ డెస్క్ ను అనుమతులకు ప్రారంభించాలని ఆదేశించారు. పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి.రమణ మూర్తి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఎం.టి.ఎం.సి కమిషనర్ అలీం భాషా, పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్, ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.



