కఠోర పరిశ్రమకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి బి.సి సంఘాల నాయకులతో కలిసి భగీరథ మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భగీరధుడు మహా జ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరు అన్నారు. దీక్షకు, సహనానికి ప్రతిరూపమని, ఎంత కష్టాన్నయినా భరించి అనుకున్నది సాధించే గొప్ప లక్షణం కలిగిన వ్యక్తి అన్నారు. భావి తరాలు భగీరథుని చరిత్రను మననం చేసుకుని స్ఫూర్తిని పొందాలని అనుకున్న లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. కఠోర పరిశ్రమకు భగీరథ ప్రయత్నం చేశారని నానుడిని గుర్తు చేశారు. భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చారని అన్నారు. యువత మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని, కష్ట పడితే సాధించలేనిది ఏదీ లేదని గుర్తించాలని సూచించారు. యువతకు ప్రపంచంలో అనేక అవకాశాలు ఉన్నాయని, అందుకు అవసరమైన నైపుణ్యం సాధించాలని అన్నారు. భగీరథ మహర్షి వంటి మహానుభావుల జయంతి వేడుకలు నిర్వహించుకోవడం అంటే, వారిలో ఉన్న కష్టపడే తత్వం, త్యాగాలు, సమాజానికి అందించిన నైతిక విలువలు మననం చేసుకోవడం, వాటిని స్పూర్తిగా తీసుకుని పనిచేయడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, బి.సి సంఘాల నాయకులు వేములకొండ శ్రీనివాస్, జంపని నాగేశ్వర రావు, షేక్ షూకుర్, రాజకొండ నాగేశ్వర రావు, గొణుగుంట్ల సుధీర్, కె.వెంకయ్య, సందేటి సాంబశివరావు, కర్నాటి శివ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



