త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి, సామరస్య వాతావరణంలో అత్యంత వైభవంగా జరుపుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆయన హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రధాన మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, మొబైల్ పెట్రోలింగ్ వాహనాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు. పండుగ సమయంలో ఎలాంటి అపోహలు, ఉద్రిక్తతలకు తావులేకుండా స్థానిక ప్రజలతో సమన్వయం పెంపొందించుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాలపై పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోందని ఎస్పీ స్పష్టం చేశారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించేలా అభ్యంతరకర పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం సోషల్ మీడియా విభాగాన్ని 24 గంటలు అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. పండుగ రోజున ప్రార్థనా స్థలాలు, రద్దీ కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేస్తున్నామని, ప్రజల వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు..



