
“గులాబీ జెండా ఆవిర్భవించి 24 వసంతాలు పూర్తయిన వేళ, తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి, శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో దిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన కొనియాడారు.
పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టిన కేసీఆర్ అడుగుజాడల్లో, మళ్లీ పార్టీని పట్టాలెక్కించేందుకు పునరంకితమవుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, ప్రజా పక్షాన నిలబడి అడుగడుగునా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా ఉండి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.”


