గుంటూరు:– దివ్యాంగుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు, ప్రోత్సాహం కల్పిస్తే అద్భుత విజయాలు సాధించి సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ అన్నారు. మానవ సేవే నిజమైన మహోన్నత సేవని, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడమే సేవకు అసలైన అర్థమని పేర్కొన్నారు.
గుంటూరులోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రెవెన్యూ కళ్యాణ మండపంలో శ్రీ పబ్బరాజు వెంకటేశ్వరరావు–రాజ్యలక్ష్మి స్మారక మానవ సేవా జాతీయ అవార్డుల ప్రదానోత్సవం–2026 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ, ఉద్యోగ విరమణ అనంతరం తన జీవితాన్ని దివ్యాంగుల సేవకు అంకితం చేసిన పబ్బరాజు వెంకటేశ్వరరావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
చూపులేని చిన్నారులకు విద్యను అందించి, వారు స్వతంత్రంగా జీవిస్తూ ఉన్నత స్థాయికి చేరుకునేలా వెంకటేశ్వరరావు చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. కేవలం రెండు గదులతో ప్రారంభమైన సంస్థ ద్వారా అనేక మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఒక వ్యక్తికి విద్యను అందించడం ద్వారా అతని జీవితాన్ని మార్చవచ్చని, అలాంటి మహోన్నతమైన సేవను వెంకటేశ్వరరావు ఆచరణలో చూపించారని అన్నారు.Guntur City News
వెంకటేశ్వరరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన అందించిన సేవలు, చూపిన మార్గం సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. దివ్యాంగులలోని ప్రతిభను గుర్తించి, వారికి సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఈ సందర్భంగా జాతీయ సేవా అవార్డులు అందుకున్న ఐఐటీ మద్రాస్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హేమచంద్రన్ కరహ్, విజయనగరంలోని ఎం.ఆర్. సంస్కృత కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కుమార సోమశేఖర్లను భాష్యం రామకృష్ణ అభినందించారు. చిన్నతనంలోనే చూపు కోల్పోయినప్పటికీ, అనేక సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుకోవడం ద్వారా వారు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
సాధించాలనే పట్టుదల, లక్ష్యంపై స్పష్టత ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని అవార్డు గ్రహీతల జీవితాలు నిరూపిస్తున్నాయని అన్నారు. దివ్యాంగుల ప్రతిభను గుర్తించడం, వారిని ప్రోత్సహించడం, వారి విజయాలను గౌరవించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
అవార్డుల ప్రదానోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులను అభినందించిన భాష్యం రామకృష్ణ, పబ్బరాజు వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మి ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. మరెంతోమంది దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలని అన్నారు.
సేవ చేయడానికి పెద్ద పదవులు, ఆర్థిక స్థోమత మాత్రమే అవసరం లేదని, ఇతరులకు సహాయం చేయాలనే మంచి మనసు ఉంటే చాలని భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. మానవత్వంతో చేసే సేవే సమాజంలో శాశ్వత గుర్తింపును సంపాదిస్తుందని తెలిపారు.



