వినుకొండ: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వినుకొండ కొండపై కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అఖండ జ్యోతిని వెలిగించి భక్తులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, వచ్చే సంవత్సరం తొలి ఏకాదశి నాటికి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
కొండ చుట్టూ నిర్మిస్తున్న గిరిప్రదక్షిణ రహదారి పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు, ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.



