గుంటూరు, నవంబర్ 10:– జిల్లాలో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయాలు జరపాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు. నిర్ణీత ధరలకు మించి విక్రయాలు జరిపినా, తూనికలు, కొలతల్లో అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంగళవారం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లు, హోల్సేల్ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం రకాల వారీగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వివరించారు. బీపీటీ (సోనా, సాంబా), కేఎన్ఎం రకాల బియ్యం కిలో రూ.66, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ రకాలు రూ.76, స్వర్ణ మసూరి రూ.47, జై శ్రీరామ్ రకం రూ.82 చొప్పున విక్రయించాలని ఆదేశించారు.
ప్రతి బియ్యం దుకాణం, రైస్ మిల్లుల వద్ద రకాల వారీగా ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడా నిర్ణీత ధరలకు మించి విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
బియ్యం వ్యాపారంలో అధిక ధరల వసూళ్లు, అక్రమాలు, తూనికలు, కొలతల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు, కొలతల శాఖ, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జీఎస్టీ శాఖల అధికారులు సమన్వయంతో సంయుక్త తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ధరణి బియ్యం కేంద్రాలకు ప్రజల నుంచి స్పందన
జిల్లాలోని రైతు బజార్లలో ఇప్పటికే ఆరు ధరణి బియ్యం విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 4,500 మంది వినియోగదారులకు 1,150 క్వింటాళ్ల కేఎన్ఎం, బీపీటీ రకాల బియ్యాన్ని విక్రయించినట్లు వెల్లడించారు. ఈ కేంద్రాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో మరో కేంద్రాన్ని అదనంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.Guntur City News
సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కోమలి పద్మశ్రీ, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఎన్. నాగేశ్వరరావు, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.



