హైదరాబాద్, అక్టోబర్ 4:- రాజకీయ పార్టీలు విశ్వకర్మలకు వారి జనాభా దామాషా ప్రకారం సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విశ్వకర్మల కమ్యూనిటీ జేఏసీ డిమాండ్ చేసింది. విశ్వకర్మల సమస్యల పరిష్కారం, రాజకీయ ప్రాతినిధ్యంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జేఏసీ కో-కన్వీనర్ అట్లూరి రవీంద్ర చారి మాట్లాడుతూ విశ్వకర్మ సమాజంలోని ప్రధాన ఐదు వృత్తులకు చెందిన వారు వివిధ రంగాల్లో స్థిరపడి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, రాజకీయంగా వారికి దక్కాల్సిన వాటా మాత్రం లభించడం లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయ పదవులు, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.HYderabad City News
విశ్వకర్మలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి హక్కులు, సమస్యలపై సమిష్టిగా పోరాడేందుకు విశ్వకర్మల కమ్యూనిటీ జేఏసీ ఏర్పడిందని తెలిపారు. రాజకీయ ప్రాతినిధ్యం సాధించడంతో పాటు విశ్వకర్మలకు సంబంధించిన అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు జేఏసీ కృషి చేస్తుందని చెప్పారు.
విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి సహకరించాలని సమావేశంలో వక్తలు కోరారు. రాజకీయ పార్టీలు విశ్వకర్మ సమాజానికి తగిన ప్రాధాన్యం ఇచ్చి, జనాభా దామాషా మేరకు రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.



