Vijayawada City News :సమానత్వం కోసం కలంతో పోరాడిన మహాకవి గుర్రం జాషువా-విజయవాడలో ఘనంగా గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు

S Sarath
1 View

విజయవాడ, సెప్టెంబర్ 28:-సామాజిక అసమానతలు, అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలచుకుని అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి స్వరం అందించిన మహాకవి గుర్రం జాషువా అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భావకవిత్వం ఉప్పొంగుతున్న సమయంలోనే సామాజిక స్పృహను తన కవిత్వంలో మేళవించి ప్రజలను చైతన్యవంతం చేసిన అరుదైన ప్రజాకవి జాషువా అని పేర్కొన్నారు.

విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య కళా వేదికలో రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో పద్మభూషణ్, కవిసామ్రాట్ గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తెలుగు సాహిత్య వికాసం, పరిరక్షణకు విశేష కృషి చేసిన షేక్ కరీముల్లా, డాక్టర్ జాలాది విజయకుమారి, విల్సన్ రావు కొమ్మవరపు, గడ్డం ఈశ్వరమ్మలకు ‘కవిసామ్రాట్ గుర్రం జాషువా కవికోకిల సాహితీ పురస్కారాలు’ అందజేశారు. ఒక్కొక్కరికి రూ.50 వేల నగదు ప్రోత్సాహకం, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని మంత్రి దుర్గేష్ అందించి సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాషువా తన సాహిత్యంతో సామాజిక అసమానతలపై పోరాడారని తెలిపారు. మానవ హక్కులు, సమానత్వం కోసం ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’ వంటి రచనల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేశారని చెప్పారు. అంటరానితనాన్ని ఎదుర్కొనేందుకు అక్షరాన్ని ఆయుధంగా మలచుకున్న ధీశాలి జాషువా అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఛీత్కారాలు ఎదురైన చోటే అనంతరం సత్కారాలు పొందిన మహాకవి జాషువా అని అన్నారు.Vijayawada City news

జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పురస్కారాలు అందుకున్న నలుగురు సాహితీవేత్తల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కళలు, సాహిత్యం, సంస్కృతికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రముఖుల జయంతి వేడుకలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తూ వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా గుర్రం జాషువా రచించిన పద్యాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా ఆలపించారు. దీంతో సభలో సాహితీ ప్రియులు, కళాకారుల నుంచి విశేష స్పందన లభించింది.

నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సరళమైన భాషలో పద్యాలు రచించిన మహాకవి జాషువా అని అన్నారు. రాష్ట్రంలో సాంస్కృతిక రంగానికి ప్రోత్సాహం పెరుగుతోందని తెలిపారు. ఇటీవల బోయి భీమన్న అవార్డులు అందించామని, త్వరలో కందుకూరి పురస్కారాలతో పాటు నంది నాటకోత్సవాలు, నంది అవార్డులను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ జాషువా కవిత్వం నేటికీ సమాజాన్ని ఆలోచింపజేస్తోందన్నారు. వివక్షను ప్రశ్నిస్తూ సామాజిక మార్పును కోరేలా ఆయన రచనలు నిలిచాయని తెలిపారు. జీవితంలో ఎదురైన కష్టాలను కవిత్వంగా మలచి సమాజాన్ని చైతన్యపరిచిన గొప్ప కవి జాషువా అని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు, పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review