Guntur Local News :తల్లికి వందనం నగదు జమపై లబ్ధిదారుల హర్షం

Sharat
1 View

పెదకాకాని :– రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడంతో పెదకాకాని మండలం లూధరగిరి గ్రామానికి చెందిన తల్లులు ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల విద్యాభారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తోందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లింగంగుంట సాల్మన్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ “తల్లికి వందనం” పథకం వర్తింపజేయడం ప్రభుత్వ విద్యా సంక్షేమానికి నిదర్శనమని అన్నారు. ఈ పథకం ద్వారా పిల్లల చదువుకు అవసరమైన ఖర్చులను భరించేందుకు కుటుంబాలకు ఆర్థికంగా అండ లభిస్తుందని చెప్పారు.

ఆత్మకూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆనందరావు మాట్లాడుతూ ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యను ప్రోత్సహించే ఈ పథకం వల్ల పేద కుటుంబాల పిల్లలు చదువును కొనసాగించేందుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.

తల్లికి వందనం పథకం ద్వారా నగదు జమ కావడంతో లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇటువంటి సంక్షేమ పథకాలు విద్యాభివృద్ధికి మరింత దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Author
Share This Article
Leave a review