తాడేపల్లి (అమరావతి):– క్రీడల్లో ప్రతిభ చాటుతూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన వినుకొండ ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి దేవళ్ల సాయికుమార్ పై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత ప్రశంసల వర్షం కురిపించారు. శభాష్ సాయి అంటూ ఆ అబ్బాయిని ఆప్యాయంగా అభినందించారు.
ఇటీవల మర్కాపురంలో నిర్వహించిన 11వ ఏపీ స్టేట్ సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సాయికుమార్ ‘బెస్ట్ ప్లేయర్’ అవార్డును దక్కించుకోవడమే కాకుండా, మూడో స్థానంలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ ప్రతిభ ఆధారంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ పోటీల్లో ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహించే అర్హత సాధించాడు.Amaravathi city News
ఈ నేపథ్యంలో, బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోచ్ జూనా నాయక్, ప్రిన్సిపాల్ వై.రమేశ్‌లతో కలిసి సాయికుమార్ మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయికుమార్‌ను మంత్రి నూతన వస్త్రాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే, విద్యార్థిని తీర్చిదిద్దిన కోచ్ జూనా నాయక్, ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ రమేశ్‌ల కృషిని మంత్రి ప్రత్యేకంగా కొనియాడారు.



