Tirupathi City News :ఆంజనేయపురం అభయాంజనేయ స్వామి ఆలయం మార్పిడి అంశంలో వాస్తవాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్

S Sarath
1 View

తిరుపతి:– ఆంజనేయపురం అభయాంజనేయ స్వామి ఆలయ తరలింపు వ్యవహారంలో జరుగుతున్న దుష్ప్రచారాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఆలయ భూదాత కుమారుడు, ప్రధాన అర్చకులు పూర్తిస్థాయి స్పష్టతనిచ్చారు. గ్రామస్థులు, అధికారుల సమక్షంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలయ మార్పిడికి సంబంధించిన వాస్తవాలను వారు బయటపెట్టారు.

గత ప్రభుత్వ హయాంలోనే అలైన్‌మెంట్, భూసేకరణ కడప–రేణిగుంట జాతీయ రహదారి-716 విస్తరణ నేపథ్యంలో 2019 డిసెంబర్‌లోనే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించిన అలైన్‌మెంట్ ప్రకారం పనులు జరుగుతున్నాయని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2023 జనవరిలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టులో అవార్డు ప్రక్రియ పూర్తి చేసి భూమిని జాతీయ రహదారుల శాఖకు అప్పగించినట్లు తెలిపారు. హైవే అలైన్‌మెంట్‌ను మార్చే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉండదని తేల్చిచెప్పారు.

10 సెంట్లకు బదులుగా 50 సెంట్లు, రూ. 59.30 లక్షల పరిహారం సుమారు 60 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన సుఖదానయ్య నిర్మించిన ఈ ఆలయానికి సంబంధించి 10 సెంట్ల భూమి రహదారి విస్తరణలో పోతుండగా, ప్రత్యామ్నాయంగా ఆలయానికి ఆనుకునే 50 సెంట్ల స్థలాన్ని కేటాయించామని కలెక్టర్ వివరించారు. గ్రామ పెద్దల సమ్మతితో ఈ ఏడాది ఆగస్టులో రూ. 59.30 లక్షల పరిహార మొత్తాన్ని దేవాదాయ శాఖకు డిపాజిట్ చేశామని, ఆ నిధులతో నూతన ఆలయ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఈ అంశంపై అసత్య ప్రచారాలు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని హితవు పలికారు.

ఎవరి ఒత్తిడి లేదు.. అందరి అంగీకారంతోనే: భూదాత కుమారుడు ఆలయ భూదాత కుమారుడు హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితమే హైవే విస్తరణ, ఆలయ మార్పిడిపై అధికారులు తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. 10 సెంట్లకు బదులుగా 50 సెంట్ల స్థలంతో పాటు కొత్త ఆలయం నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులందరూ అంగీకరించారని చెప్పారు. ఇందులో ఎవరి బలవంతం, ఒత్తిడి లేదని, గ్రామ పెద్దలందరూ దీనికి ప్రత్యక్ష సాక్షులని స్పష్టం చేశారు.

శాస్త్రోక్తంగా బాలాలయ కార్యక్రమం: అర్చకులు నిత్య పూజలకు ఆటంకం కలగకుండా జాతీయ రహదారుల శాఖ ఆలయం పక్కనే తాత్కాలిక గదిని నిర్మించిందని ప్రధాన అర్చకులు తెలిపారు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం నవంబర్ 22న గ్రామస్థుల సమక్షంలో కలశ స్థాపన, గోపూజ, శాంతి హోమం నిర్వహించి, శాస్త్రోక్తంగా బాలాలయ కార్యక్రమం ద్వారా స్వామివారిని తాత్కాలిక ఆలయంలో ప్రతిష్ఠించామని వివరించారు. ఆ తర్వాతే నవంబర్ 23న పాత ఆలయ తొలగింపు ప్రక్రియ చేపట్టామన్నారు.Tirupathi District City News

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ఈవో, జాయింట్ కలెక్టర్, ఎన్ హెచ్ పీడీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review