కాకినాడ, నవంబర్ 25:– కాకినాడ జిల్లా ఉప్పాడ మండలం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. వారం రోజులుగా వారి ఆచూకీ లభించకపోవడంతో కోస్ట్‌గార్డ్, నేవీ బలగాలు సంయుక్తంగా రంగంలోకి దిగి సముద్రాన్ని జల్లెడ పడుతున్నాయి.
అసలేం జరిగింది? సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతైనట్లు ఈ నెల 19వ తేదీ సాయంత్రం జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. దీనిపై తక్షణమే స్పందించిన అధికారులు కోస్ట్‌గార్డ్‌ను అప్రమత్తం చేశారు. కోస్ట్‌గార్డ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు అందిన వివరాల ప్రకారం.. ఈ నెల 18వ తేదీన ఒడిశాలోని పారాదీప్ పోర్టు సమీపంలో వీరు కనిపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత వారి నుంచి ఫోన్ ద్వారా గానీ, ట్రాన్స్‌పాండర్ ద్వారా గానీ ఎలాంటి సిగ్నల్స్ అందలేదు.
సరిహద్దులు దాటిన గాలింపు చర్యలు మత్స్యకారుల ఆచూకీ కోసం కాకినాడ కోస్ట్‌గార్డ్ అధికారులు ఒడిశా, చెన్నై కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ గాలింపును ముమ్మరం చేశారు. ప్రస్తుతం నేవీ, కోస్ట్‌గార్డ్ బలగాలు యుద్ధ నౌకలు, హెలికాప్టర్ల సాయంతో సముద్రంలో నిరంతరాయంగా గాలిస్తున్నాయి. గాలి ఉధృతికి బోటు పక్క దేశాల జలాల్లోకి వెళ్లి ఉండే అవకాశం ఉండటంతో, బంగ్లాదేశ్, మయన్మార్ నేవీ అధికారులకు కూడా సమాచారం అందించి అప్రమత్తం చేశారు. వివిధ నిఘా వ్యవస్థల ద్వారా వారి చివరి కదలికలను ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.KakinadaPride
కలెక్టర్ భరోసా ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వారి ఆచూకీ లభించే వరకు అన్ని విభాగాల సమన్వయంతో గాలింపు చర్యలు ఆగవని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.



