జలధార – జలహారతి” గ్రామ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సోమవారం సమీక్షించారు. జిల్లాలో అన్ని శాఖల క్రింద ఉన్న ప్రతీ చెరువు, ప్రతి నీటి నిలువ ప్రదేశం జాబితాలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పూడికలు తీయాలని, గరిష్ట నీటి సామర్థ్యం మేరకు నిలువ చేయాల్సిందేనని అన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని చెప్పారు. ఉపాధి హామీ వేతనదారుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ లో ప్రజల సానుకూల దృక్పథం ఉండాలని అన్నారు.భూ సేకరణ ప్రక్రియ ఆర్.డి.ఓ లు, తహసీల్దార్ల బాధ్యత అని జిల్లా కలెక్టర్ అన్నారు. భూసేకరణ ప్రక్రియ నిబంధనలు స్పష్టంగా పాటించాలని ఆదేశించారు. 22 ఏ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అదే సమయంలో ఎటువంటి తప్పిదాలకు అవకాశం ఉండరాదని స్పష్టం చేశారు. సి.ఆర్.డి.ఎ పరిధిలో వస్తున్న ఆర్ 1 క్లెయిమ్ లు సి.ఆర్.డి.ఎ అధికారులతో సమన్వయం చేస్తూ గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. రీ సర్వే ప్రక్రియ పూర్తి నాణ్యత కలిగి ఉండాలని, గ్రౌండ్ ట్రూథింగ్ పై శ్రద్ధ వహించాలని సూచించారు. 13 నోటీస్ జారీ చేయాలని, రైతులకు తెలియజేసి ఇ కెవైసి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ రీ సర్వే గ్రామాన్ని కనీసం రెండు సార్లు సందర్శించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జిల్లాలో నాలుగవ విడత రీ సర్వేలో 35 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తి అయిందని, ఐదవ విడత రీ సర్వేలో 25 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ ప్రారంభం అయిందన్నారు.


