అమృతలూరు, జూలై 28: అమృతలూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన “మీకోసం (PGRS) – ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం”లో వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ నేపథ్యంలో ఈ వారం మంగళవారం నిర్వహించారు.
అమృతలూరు మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, ఆదాయ ధ్రువపత్రాలు, పింఛన్లు, గృహ నిర్మాణం, తాగునీటి సౌకర్యం, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ఫిర్యాదులు, వినతిపత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు.
ప్రజలు సమర్పించిన ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నక్కా ఆనందబాబు, వాటిని వెంటనే పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడం, సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అర్జీపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.



