ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో) అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా అందించే “4వ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ (జిఈఎం) అవార్డు”ను గుంటూరు నగరపాలక సంస్థ దక్కించుకోవడం పట్ల నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో బుధవారం యునిడో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండస్ట్రీస్’ (ఐడిడబ్ల్యుఐ 2026) వేడుకల్లో భాగంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఫిన్లాండ్ మాజీ అధ్యక్షురాలు తార్జా హాలోనెన్, యునిడో మేనేజింగ్ డైరెక్టర్ సిసిలియా ఉగాజ్ ఎస్ట్రాడా, వియన్నాలోని ఐక్యరాజ్యసమితికి ఫిన్లాండ్ శాశ్వత ప్రతినిధి నీనా వాస్కున్లాహ్తి మరియు సీనియర్ జెండర్ ఈక్వాలిటీ లీడ్ ఆరేలియా పాట్రిజియా కాలాబ్రో వంటి అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు హాజరైన ఈ సదస్సులో గుంటూరు నగరానికి ఈ అరుదైన గౌరవం లభించింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యునిడో మేనేజింగ్ డైరెక్టర్లు సిసిలియా ఉగాజ్ ఎస్ట్రాడా మరియు ఫాటౌ హైదరా చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును గుంటూరు తరపున సస్టైనబుల్ సిటీస్ ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఓల్గా రతాజ్ అందుకున్నారన్నారు. మహిళా సాధికారితలో భాగంగా మహిళలను భాగస్వామ్యం చేయడం, ఎలక్ట్రికల్ ఆటోల ద్వారా కాలుష్య రహిత చెత్త సేకరణ ప్రారంభించడం అనేది సామాజిక ఉన్నతి, జీరో ఉద్గారాల సేకరణతో కూడిన ఒక విశిష్టమైన కలయికగా జిఎంసి చేపట్టిందన్నారు. గుంటూరు నగరంలో గతంలో వ్యర్థాల సేకరణ చేసే సుమారు 200 మందికి పైగా మహిళా కార్మికులను గుర్తించి, వారికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందించి, అధికారికంగా ఈ-ఆటోల డ్రైవర్లుగా తీర్చిదిద్దడమే ఈ పురస్కారానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. మహిళా సాధికారతతో పాటు పర్యావరణ హితమైన ‘హరిత ఆర్థిక వ్యవస్థ’లో (గ్రీన్ ఎకానమీ) ఈ మహిళలు కీలక భాగస్వాములుగా మారడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. సాంకేతికతను సామాజిక మార్పు కోసం ఎలా వినియోగించవచ్చో ఈ ప్రాజెక్ట్ నిరూపించిందని, గుంటూరు నగరపాలక సంస్థ సాధించిన ఈ విజయం ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతినిధులు, ప్రైవేట్ రంగ నాయకులు మరియు అంతర్జాతీయ అభివృద్ధి భాగస్వాముల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో గుంటూరు నగరపాలక సంస్థకు అవార్డ్ రావడం గర్వకారణమన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన కార్పొరేషన్ బృందానికి మరియు మహిళా డ్రైవర్లకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలతో గుంటూరును సుస్థిరమైన నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.



