గుంటూరు నగరపాలక సంస్థ మరోసారి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభాపురస్కారాన్ని అందుకుంది. గురువారం విజయవాడలోని ది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్స్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 పై జరిగిన రాష్ట్ర స్థాయి కమిషనర్ల వర్క్ షాప్ లో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో గుంటూరు నగరపాలక సంస్థ అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, సిడిఎంఏ సంపత్ కుమార్ లు గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కి ప్రశంసా పత్రం, షీల్డ్ అందించి అభినందించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను వసూళ్లలో 2026-27లో గత సంవత్సరంతో పోలిస్తే 5 శాతం రాయితీతో వసూళ్లలో జిఎంసి రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో ఉందన్నారు. ఇందులో నగరంలోని పన్ను చెల్లింపుదారులు చొరవతో పాటు జిఎంసి రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శుల సమిష్టి కృషి ఉందని, వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. నగరాభివృద్ధిలో ఆస్తి పన్ను వసూళ్లు ఎంతో కీలకమని, రాష్ట్ర స్థాయి గుర్తింపుతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం పన్ను మరింత స్పూర్తితో వసూళ్లు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. నగర ప్రజలు కూడా మరో 8 రోజుల్లో ముందస్తుగా చెల్లించే ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ, పాత బకాయిలు ఏక మొత్తంగా చెల్లింపులో వడ్డీపై 50 శాతం రాయితీ గడువు ముగుస్తున్నందున ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



