జిల్లాలో డీజిల్ కొరత మరింత తీవ్రరూపం దాల్చింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉన్న డీజిల్ కొరత ప్రస్తుతం పట్టణాలకు కూడా తాకింది. ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు లాంటి డీజిల్ తో నడిచే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. డీజిల్ కోసం గంటలతరబడి క్యూ కడుతున్నారు. మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి సరిపడా డీజిల్ సరఫరా చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఇందులో మరోకోణం ఏమిటి అంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ వ్యాపారులు తెరమీదకు వస్తారు. అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకొని అతి కొద్ది సమయంలోనే అక్రమంగా లక్షలు సంపాదిస్తున్నారు. ఇందుకు సంబంధిత శాఖల అధికారులు కూడా పరోక్షంగా సహకరిస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా గత 4 నెలల క్రితం ఏర్పడిన గ్యాస్ కొరత ఇప్పటికీ గాడిలో పడలేదు. బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ సిలిండర్లు 4 వేల వరకు అమ్ముతున్నారు. దీని ఫలితంగా హోటల్లో టిఫిన్, భోజనం రేట్లు సైతం విపరీతంగా పెంచి దోపిడీ చేస్తున్నారు. మరోవైపు వంట నూనెల ధరలు కూడా 30 శాతం పెంచేశారు. ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా చివరికి పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకే నష్టం జరుగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న డీజిల్, గ్యాస్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.



