GUNTUR DISTRICT NEWS: శ్రమ శక్తి విలువను, విశిష్టతను గుర్తించాలి

Karthik

దేశ ప్రగతికి, సమాజ మనుగడకు మూలాధారమైన శ్రమ శక్తి ఔన్నత్యాన్ని గుర్తించి, గౌరవించాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి కె.జి.శంకర్ అన్నారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక యు.టి.ఎఫ్ హాలులో మేడే సందర్భాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది కవులు, గాయకులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ ప్రసంగిస్తూ దేశ సంపద సృష్టికర్తలు కోట్లాది మందితో కూడిన శ్రామిక వర్గమేనని, వారి శ్రేయస్సు కోసం కార్మిక చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. కార్యక్రమానికి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు వి.వి.కే.సురేష్ అధ్యక్షత వహించారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న పంచాయతీరాజ్ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ జి.బ్రహ్మయ్య మాట్లాడుతూ శ్రమైక జీవన సౌందర్యం విశిష్టమైన మన జీవన సంస్కృతిలో ముఖ్యమైన భాగమని, ప్రస్తుత విధానాలు మరియు నేటి విపత్కర పరిస్థితులు శ్రామిక వర్గాన్ని మరింత దుర్భర స్థితిలోకి నెట్టే విధంగా ఉన్నాయని తెలిపారు. సమైక్యత, సమ భావనతో అందరం కలిసికట్టుగా ఉండాలని అన్నారు. ఇందులో భాగంగా అనేకమంది గాయకులు దేశ భక్తి, అభ్యుదయ గేయాలను ఆలపించారు. పలువురు కవితలు చదివారు. నృత్యం, నాటిక ప్రదర్శన, హాస్యవల్లరిలో కొంతమంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ ఎన్.భావన్నారాయణ, ప్రముఖ కవి నానా, డి.రమణమూర్తి, జి. లూధర్ పాల్, వై.లక్ష్మీ కనక దుర్గ, పి. శ్రీనివాసాచార్యులు, వై.గాంధీ రామ్మోహనరావు, కాకుమాను నాగేశ్వరరావు మరియు ఎమ్.వి.ఎస్. కోటేశ్వరరావు మెమోరియల్ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review