రాజధానిలో పేదల అభివృద్ధిని విస్మరించి, పెద్దలకు భూములు దోచిపెడుతుందని సిపిఎం రాష్ర్టకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు అన్నారు.ప్రజారాధానిగా ఉండాలంటే పేదల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు.ఆదివారం గుంటూరు బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాలోని ఆర్5 జోన్లో ఇళ్ల స్థలాలు రద్దు అయిన పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు కోరారు. గత ప్రభుత్వ హయాంలో సిఆర్డిఎ పరిధిలోని సుమారు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని గుంటూరు, మంగళగిరి, దుగ్గిరాల, కృష్ణా, ఎన్టిఆర్ జిలాల్లోని 50వేల మంది పేదలకు 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారని, వాటిని ప్రస్తుత ప్రభుత్వం జిఒ 91 ద్వారా రద్దు చేసిందన్నారు. కానీ వారికి వేరే ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించలేదన్నారు. కూటమి ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్థానం చేసిందని, దాని ప్రకారం ఇళ్ల స్థలాలు రద్దు అయిన పేదలకు సుమారు 2వేల ఎకరాలు కేటాయించాల్సి ఉందన్నారు. అలాగే రాజధానిలోని 29 గ్రామాలతోపాటు సిఆర్డిఎ పరిధిలోని 56 మండలాల్లో పేదలకు ఇళ్ల స్థలాల విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదన్నారు. మరోవైపు రైతుల నుండి సేకరించిన వేలాది ఎకరాలకు తక్కువ ధరకు కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందన్నారు. వివిధ ప్రైవేటు యూనివర్సిటీలకు ఎకరం రూ.50 లక్షలకే కేటాయించి, ప్రభుత్వ సంస్థలకు మాత్రం నాలుగైదు కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు. రాజధానికి మొదట 54వేల ఎకరాలు సమీకరించారని, రెండో దశలో 20వేల ఎకరాలు సమీకరించనున్నారని, మూడవ దశలో 43 గ్రామాల పరిధిలో 1.54 లక్షల ఎకరాల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ఇప్పటి వరకూ సమీకరించిన భూమి, సమీకరించాల్సిన భూమి కలిపి 2.30 లక్షల ఎకరాలు ఉంటుందని, ఇంత పెద్ద ఎత్తున రైతుల నుండి భూమి సమీకరించి బడా కార్పొరేట్ కంపెనీలకు కేటాయిస్తున్నారని, పేదలను విస్మరిస్తున్నారని విమర్శించారు. అంతే కాకుండా 189 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు పేరుతో వేలాది ఎకరాలు తీసుకోనున్నారన్నారు. మొదటి దశలో సమీకరించిన భూములను అభివృద్ధి చేయాలని, రెండో దశ భూసమీకరణ ఆపాలని డిమాండ్ చేశారు.మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు 20వేల మందికి ఇళ్లు కట్టిస్తామని, పట్టాలు మంజూరు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల స్థలాల సమస్యలపై మే, జూన్ నెలల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. మేలో ఆందోళనలు చేసి, అప్పటికీ స్పందించకపోతే జూన్లో మంత్రి లోకేష్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు, ఈమని అప్పారావు, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.



