GUNTUR DISTRICT NEWS: కలెక్టర్ కు కృతఙ్ఞతలు తెలిపిన కొత్త రెడ్డిపాలెం వాసులు – డయేరియా బాధితులు అందరూ కోలుకుని ఆనందంగా ఇంటికి గుంటూరు

Karthik

చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో డయేరియాకు గురైన 60 మంది కోలుకుని ఆనందంగా ఇంటికి వెళ్లారు. ఈ మేరకు కొత్త రెడ్డిపాలెం వాసులు తరుపున కోడూరు బెంజమిన్ జిల్లా కలెక్టర్ కు కృతఙ్ఞతలు తెలుపుతూ మెయిల్ పంపించారు. అందరు కోలుకుని ఇంటికి వెళ్ళడంతో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు.15వ తేదీన చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో డయేరియా ప్రభలుతున్నట్లు వార్తలు అందిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించడంతో వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. డయేరియాకు గురైన చివరి వ్యక్తి కూడా కోలుకుని మంగళవారం ఉదయం డిశ్చార్జ్ కావడం జరిగిందని తెలిపారు. 15వ తేదీన జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామంలో పర్యటించి పరిస్థితులను తనిఖీ చేశారు. శాసన సభ్యులు కూడా పర్యటించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టడంతో చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో తలెత్తిన డయేరియా బాధితులు త్వరితగతిన కోల్కొని ఇంటి ముఖం పట్టడం జరిగిందని ఈ సంఘటన రుజువు చేసింది. కొత్త రెడ్డిపాలెంలో కలుషిత ఆహారం తీసుకోవడం వలన డయేరియా లక్షణాలు ప్రబలి పలువురు ఆసుపత్రికి వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దృష్టికి బుధవారం వచ్చిన వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖను తక్షణం రెడ్డిపాలెం సందర్శించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, అవసరమైన అన్ని అత్యవసర మందులతో సహా సిద్ధంగ ఉంచాలని ఆదేశించడం జరిగింది. రెండు అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు. గ్రామ పారిశుధ్యం పట్ల పంచాయతీ వ్యవస్థ ను సంసిద్ధం చేసి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా తాగునీటి వలన డయేరియా అవకాశాలు ఉండవచ్చనే ఆలోచనతో గ్రామీణ నీటి సరఫరా విభాగాన్ని అప్రమత్తం చేసి గ్రామస్తులందరికీ ఆర్.ఓ నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో ఉన్న నీటి వనరుల నమూనాలను సేకరించి వెంటనే తాగునీటి పరీక్షలు చేయించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారి, ఇతర జిల్లా అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితులను చేయి దాటిపోకుండా చేయుటకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతలను అప్పగించి సమయానుకూల నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీంతో పరిస్థితులు చేయి దాటిపోకుండా ఉండటమే కాకుండా ఎటువంటి తీవ్ర పరిణామాలకు దారి తీయకుండా నివారించడం జరిగింది. గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విందులో ఆహారాన్ని తీసుకోవడం,  కొంత మందికి ఇళ్లకు వాటిని పంపిణీ చేయడం, వాటిని మరుచటి రోజు ఉదయం, మధ్యాహ్నం తీసుకోవడం వీటికి ప్రధాన కారణంగా ప్రాథమిక విచారణలో వెల్లడి కావడం జరిగింది. ఈ ఆహారం తీసుకోవడం వలన మొదటగా కొంత అస్వస్థతకు గురైన పది మంది మాత్రమే వైద్యశాలకు రావడం, వారి పరిస్థితులను గమనించి వెంటనే గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన మేరకు ఐదు బృందాలు ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్య శాఖ చేపట్టింది. 102 గృహాలు 912 జనాభా కలిగిన గ్రామంలో 60 మంది ఆరోగ్య అస్వస్థకు గురైనట్లుగా గుర్తించి వారందరికీ స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య  శిబిరానికి తరలించి వైద్య సేవలు అందించారు. నలుగురు పరిస్థితి కొద్దిమేర తీవ్రంగా ఉన్నట్లు గమనించడం వారిలో ఒకరు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉండటంతో వెంటనే వారిని తెనాలిలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. మిగిలిన వారికి స్థానిక వైద్య శిబిరంలో వెంటనే ఫ్లూయిడ్లు, అవసరమైన మందులు అందించి రేయింబవళ్లు మూడు వైద్య బృందాలతో వైద్యులు పర్యవేక్షణ చేయడం జరిగింది. స్థానికంగానే తాజా ఆహారాన్ని కూడా జిల్లా యంత్రాంగం సరఫరా చేయడం, పారిశుద్ధ్య పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం, తాగు నీటిని సరఫరా చేయడం వలన ఎటువంటి తీవ్ర పరిస్థితులకు అవకాశం లేకుండా పోయింది. జిల్లా కలెక్టర్ ప్రతిక్షణం సంబంధాలతో వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకోవడం మరింత బాధ్యతతో అధికారులు, సిబ్బంది పనిచేయడం ఇందుకు బాగా దోహదం చేసింది. గ్రామస్తులు తీసుకున్న ఆహార నమూనాలను ఆహార భద్రత అధికారుల సేకరించి వాటిని కూడా పరీక్షలకు పంపించడం జరిగింది. ఆహారమే కారణమా లేదా ఇతర వైరల్,  బ్యాక్టీరియా వంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అని దృక్పథంతో మోషన్ టెస్ట్ లకు కూడా నమూనాలను పంపించి అన్ని వైపుల నుంచి కట్టుదిట్టమైన చర్యలను చేపట్టడం జరిగింది. ఈ చర్యలు భవిష్యత్తులో విపత్తుల సంభవిస్తే వాటికి ఒక మోడల్ గా లేదా ఎస్ఓపి గా వినియోగించుటకు కూడా అవకాశం కలిగిందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం వలన ఏ పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి ఉండదనే నమ్మకం ఉందని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. డయేరియా వంటి పరిస్థితులు తీవ్రతరం అయితే మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుందని, అటువంటి పరిస్థితులకు తావివ్వకూడదనే ఉద్దేశంతో రేయింబవళ్లు పర్యవేక్షణ చేయడం జరిగిందని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేయడం వలన దీన్ని సులభంగా నివారించవచ్చని జిల్లా యంత్రాంగం నిరూపించిందని పేర్కొంటూ ఏ కుటుంబమైనా ఒక వ్యక్తిని నష్టపోతే తీవ్రమైన క్షోభ అనుభవిస్తుందని, అటువంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదని అన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండటమే మన తక్షణ కర్తవ్యంగా పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, పరిస్థితులు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Author
Share This Article
Leave a review