హెల్తీ సిటిజన్సే.. వెల్తీ నేషన్ నిర్మించగలరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చామని సీఎం తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. లలితా పీవీఎస్ హాస్పటల్‌ను ప్రారంభించి, పరిశీలించారు. 600 పడకలతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన లలితా ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. మొత్తంగా 32 విభాగాలకు సంబంధించి ఒకేచోట వైద్య సేవలు అందించేలా ఆస్పత్రిని నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లలిత ఆస్పత్రి ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందాలని సీఎం ఆకాంక్షించారు. ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘ఆరోగ్యానికి మించిన ఆస్తి ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే నిజమైన ధనవంతులు. వేల కోట్ల రూపాయలున్నా, భవంతులు ఉన్నా, ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. ప్రభుత్వం త్వరలో సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టును చిత్తూరు జిల్లాలో అమలు చేస్తున్నాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రాం. ప్రతీ ఒక్కరికి డిజిటల్ హెల్త్ రికార్డులు తీసుకొస్తున్నాం. అత్యుత్తమ వైద్య విధానాలను ప్రజల ఇళ్ల దగ్గరకే అందుబాటులోకి తెచ్చేలా సంజీవని పని చేస్తుంది. ప్రిడెక్టివ్, ప్రెవెంటివ్, క్యూరేటివ్ విధానాన్ని అమలు చేస్తున్నాం. 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గరే చేస్తాం. ఏ మందులు వేసుకోవాలి, ఎప్పుడు ఆసుపత్రులకు రావాలనే అంశాలను కూడా సంజీవని ద్వారా ప్రజలకు గైడ్ చేస్తాం. త్వరలో యూనివర్సిల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం. ఒకొక్కరికి రూ.2.50 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తాం.’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.



