Guntur city news :మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకూ ‘తల్లికి వందనం’తో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలి-సీఐటీయూ డిమాండ్

Sharat
2 Views

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న **‘తల్లికి వందనం’**తో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) వద్ద కార్మికులు నిరసన చేపట్టి, డీఆర్‌వో ఖాజావలికి వినతిపత్రం సమర్పించారు.

యూనియన్ జిల్లా అధ్యక్షుడు పూనేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు ఇద్దరూ పట్టణ ప్రజలకు సమానంగా సేవలు అందిస్తున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో మాత్రం ఇంజనీరింగ్ కార్మికులపై వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ‘తల్లికి వందనం’తో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బి. ముత్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 వేల మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మంచినీటి సరఫరా, పైప్‌లైన్ లీకేజీల మరమ్మతులు, టౌన్ ప్లానింగ్, వీధి దీపాల నిర్వహణ, పార్కుల సంరక్షణ, కార్యాలయ సేవలు, భద్రతా విధులు తదితర కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఇంతటి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో పాటు నిత్యావసర వస్తువులు, ఇంటి అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, విద్యా, వైద్య ఖర్చులు భారీగా పెరగడంతో ప్రస్తుతం అందుతున్న వేతనాలతో కుటుంబాలను పోషించడం కార్మికులకు భారంగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా అందకపోవడంతో ఇంజనీరింగ్ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేసి అవసరమైతే సమ్మె బాట పట్టాల్సి వస్తుందని యూనియన్ నాయకులు హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు షేక్ యాసిర్ ఖాన్, పాశం పూర్ణచంద్రరావు, డేరంగుల పవన్ కుమార్, గర్నెపూడి రత్నబాబు, ఎం.వి. కిషోర్, సీహెచ్ అజిల్, కె. శ్రీకాంత్, వి. అయ్యప్ప, వి. శివకుమార్, ఆర్ముగం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review