Amaravathi news :విజయవాడ జీజీహెచ్‌లో పేదలకు ఉచిత గుండె బైపాస్ శస్త్రచికిత్సలురమేష్ హాస్పిటల్స్ ముందుకు.. ఆరోగ్యశాఖ మంత్రికి సంసిద్ధత లేఖ

Sharat
1 View

అమరావతి, ఆగస్టు 6 :– విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)కు వచ్చే నిరుపేద గుండె రోగులకు ఉచితంగా బైపాస్ శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం ముందుకొచ్చింది. తమ సంస్థ 38వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సేవలను అందించనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు తొలి దశలో ప్రతి నెల కనీసం ఐదుగురు అర్హులైన పేద రోగులకు ఉచితంగా గుండె బైపాస్ శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రమేష్ హాస్పిటల్స్ ప్రతినిధులు డాక్టర్ సుదర్శన్, రాజశేఖర్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు విజయవాడలో గురువారం సంసిద్ధత లేఖ అందజేశారు.

శస్త్రచికిత్స అనంతరం రోగులకు అవసరమైన వైద్య పర్యవేక్షణను ఆధునిక టెలీ ఐసీయూ విధానంలో అందిస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో శస్త్రచికిత్స తర్వాత కూడా రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చికిత్స అందించనున్నట్లు వివరించారు.

పేదలకు నాణ్యమైన గుండె వైద్యం అందించాలనే లక్ష్యంతో రమేష్ హాస్పిటల్స్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వాగతించారు. ప్రభుత్వ వైద్య సేవలకు ప్రైవేటు వైద్య సంస్థలు చేయూతనివ్వడం ద్వారా మరింత మంది నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా గుండె శస్త్రచికిత్స అవసరమైన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు గణనీయమైన ఊరట లభించనుంది

Author
Share This Article
Leave a review