గుంటూరు ఆర్. అగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారి ప్రాచీన దేవస్థానం ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత దేవాలయ బ్రహ్మోత్సవాలకు హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదవుల కంటే ఇది ఒక పవిత్రమైన బాధ్యతగా భావించి, భగవంతుని సేవలో నిమగ్నమవ్వాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ… దేవస్థానం వైభవం, ప్రతిష్టను మరింతగా పెంచేందుకు సమిష్టిగా కృషి చేయాలని, మరిన్ని ధార్మిక కార్యక్రమాలు చేపట్టి భక్తులను ఆధ్యాత్మికత వైపు తీసుకురావాలని సూచించారు. తమ హయాంలో ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని, దేవస్థానం అభివృద్ధి ద్వారా ప్రజలకు మరింత ఉపయోగపడేలా పనిచేయాలని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి కుటుంబాలకు శ్రేయస్సు కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.



