అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో జూన్ 21న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, యోగ సాధకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొననున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లోని వి సి హాల్లో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగ అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అపూర్వమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య సంపద అని పేర్కొన్నారు. యోగ సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవనశైలికి బాటలు పడతాయని తెలిపారు. యోగను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌కు విచ్చేసే వేలాది మంది యోగ సాధకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమ వేదిక, యోగ సాధనకు అవసరమైన ఏర్పాట్లు, సిబ్బంది నియామకం తదితర పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ యోగ కార్యక్రమం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, యోగపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు మున్సిపల్ కమీషనర్ కె. మయూర్ అశోక్, డి ఆర్ ఓ షేక్ ఖాజావలి, ఆర్డిఓ శ్రీనివాసరావు, పోలీసు, వైద్య, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.



