పెనుగంచిప్రోలు :-సొంత గ్రామ అభివృద్ధే లక్ష్యంగా జిల్లా సమైక్య మహిళా అధ్యక్షురాలు కందుల కల్పన చేపట్టిన జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ కార్యక్రమం గుమ్మడిదూర్రు గ్రామ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదూర్రులో నిర్వహిస్తున్న ఈ శిక్షణకు మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
గ్రామానికి చెందిన కందుల కల్పన, గ్రామ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో గ్రామ నాయకులు పొన్నం బాలాజీ, పొన్నం విజయలక్ష్మిని సంప్రదించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారి సహకారంతో గ్రామీణ ఉపాధి స్వయం శిక్షణ సంస్థల ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగుల తయారీపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో గుమ్మడిదూర్రుతో పాటు పరిసర గ్రామాల మహిళలు కూడా పాల్గొని జ్యూట్ బ్యాగుల తయారీకి సంబంధించిన మెళకువలను నేర్చుకుంటున్నారు. శిక్షణ అనంతరం స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను మహిళలు సొంతం చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా గ్రామ నాయకుడు పొన్నం బాలాజీ మాట్లాడుతూ, పుట్టిన ఊరి అభివృద్ధి కోసం కందుల కల్పన చూపుతున్న చొరవ అభినందనీయమని అన్నారు. గ్రామ మహిళల ఆర్థిక సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పొన్నం విజయలక్ష్మి అందించిన సహకారం కీలకమని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో పర్యావరణహిత జ్యూట్ బ్యాగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఈ శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
కందుల కల్పన చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు, మహిళా సంఘాల ప్రతినిధులు హర్షిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.



