Vijayawada Local News :యోగాంధ్ర-2026 కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం హరిత బేరం పార్కులో నిర్వహించిన మీడియా థీమ్ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పాల్గొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులతో కలిసి యోగాసనాలు నిర్వహించిన ఆయన అనంతరం మాట్లాడుతూ, ప్రస్తుత వేగవంతమైన మీడియా రంగంలో పనిచేస్తున్న పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు మరియు ఇతర మీడియా ప్రతినిధులు నిరంతరం ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. యోగా కేవలం శారీరక ఆరోగ్యానికే పరిమితం కాకుండా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సమగ్ర జీవన విధానమని వివరించారు.
మీడియా ప్రతినిధులు సమయపాలన, క్షేత్రస్థాయి విధులు, నిరంతర ఒత్తిడితో కూడిన వాతావరణంలో పనిచేస్తారని, అలాంటి పరిస్థితుల్లో యోగా వారికి శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందించి పనితీరును మరింత మెరుగుపరచడంలో దోహదపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని సూచించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న కలెక్టర్, యోగా వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలను యోగా సాధన వైపు మరింతగా ప్రోత్సహించాలని మీడియా ప్రతినిధులను కోరారు.
కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన ఆర్టిస్టిక్ యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. జయరాజు, ఉపాధ్యక్షులు చావా రవి, సీనియర్ పాత్రికేయులు ఎం. గాంధీబాబు, వైవీవీ వరప్రసాద్, సీహెచ్ విజయభాస్కర్, సీహెచ్ నారాయణరావు, డీవీ రమణ, వైడీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.



