డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, కల్తీ నెయ్యి ముసుగులో హెరిటేజ్ దోపిడీని ప్రశ్నించినందుకు, ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ మండలిలో, ప్రెస్‌మీట్‌లలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసినందుకే వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థలపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక పేరున్న విద్యా సంస్థలపై దాడి చేసిన ఆయన గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. 16వేల మందికి పైగా విద్యార్థులు, 500 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్‌తో దాదాపు రెండు దశాబ్దాలుగా నడుస్తున్న సంస్థపై దాడులు చేసి రాజకీయ కక్షసాధింపులకు దిగడం హేయమన్నారు. ఆయన వైయస్సార్సీపీ ఎమ్మెల్సీగా ఉండటమే ఆయన చేసినా తప్పా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన వ్యాపారాలపై దాడులు చేస్తారా.? ఇదే సాంప్రదాయాన్ని రాబోయే వైయస్సార్సీపీ ప్రభుత్వంలో కొనసాగిస్తే చూడాలని అనుకుంటున్నారా అని నిలదీశారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి వైయస్సార్సీపీ అండగా ఉంటుందని, రేపు సోమవారం వైయస్సార్సీపీ నాయకులు నెల్లూరు వెళ్లి ఆయన్ను కలిసి భరోసా ఇస్తారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.



