Eluru Local News :పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి- రెడ్డి అప్పలనాయుడు

Sharat
1 View

ఏలూరు, జూన్ 29 :– జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఇటీవల నిర్వహించిన దళిత క్రైస్తవ శంఖారావం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు.

ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళిత క్రైస్తవుల సమస్యలపై చర్చించాల్సిన సభను పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల వేదికగా మార్చడం సరైంది కాదన్నారు. ప్రజాదరణ కోసం వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, తాను నిర్వహిస్తున్న శాఖలతో పాటు ఇతర ప్రజా అంశాలపై కూడా చొరవ చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శించడం సమంజసం కాదన్నారు.

జడ శ్రవణ్ కుమార్ ఉద్దేశపూర్వకంగా రాజకీయ విమర్శలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్హతలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు తగవని, ప్రజల కోసం పనిచేసే నాయకుడి సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

దళితులపై ఎక్కడ అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ స్పందించారని, కైకలూరు, కారంచేడు, కృష్ణలంక తదితర ఘటనల సమయంలో బాధితులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. నేరాలకు కులాలను ఆపాదించడం సరికాదని, అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగాలన్నదే పవన్ కళ్యాణ్ అభిప్రాయమన్నారు.

దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహించే సమావేశాల్లో సంబంధిత సమస్యలపైనే చర్చించాలే తప్ప వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చకూడదని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఇప్పటికైనా అనవసర వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, పవన్ కళ్యాణ్‌పై అసత్య ప్రచారం చేస్తే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తామని రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, నగర గౌరవ అధ్యక్షుడు నగిరెడ్డి కాశి నరేష్, నాయకులు సరిది రాజేష్, బోండా రాము నాయుడు, ఎట్రించి ధర్మేంద్ర, బెజవాడ నాగభూషణం, జనసేన రవి, దేవ వరప్రసాద్, జనపరెడ్డి తేజ ప్రవీణ్, రామిశెట్టి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review