గుంటూరు, జూలై 20 : నైపుణ్య అభివృద్ధితో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ ఎ సి) ద్వారా 15 రోజులు పాటు తాపీ, ప్లంబర్, పెయింటింగ్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్ కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్లను అందజేశారు. నైపుణ్యం పెరిగితే అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చని, కుటుంబాన్ని చక్కగా పోషించుకోవచ్చని చెప్పారు. నైపుణ్యం ఉంటే దేశ విదేశాలలో అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలలో మంచి వసతులు ఉన్నాయని, నైపుణ్యం, అనుభవం గల ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్థులు షైనింగ్ స్టార్స్ గా వెలుగొందుతున్నారని అన్నారు. పిల్లల జీవితాలకు మంచి బాటలు వేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ. గాయత్రి దేవి, . నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సహాయ సంచాలకులు వి.నరసింహా రావు, తదితరులు పాల్గొన్నారు



