విశాఖపట్నం, జూలై 25: రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో ఏర్పాటు చేసిన పవర్ రూమ్‌ను ప్రారంభించిన మంత్రి, డిపోలో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజున రాష్ట్రంలో తొలి ఈ-బస్సు పవర్ రూమ్ ప్రారంభం కావడం ఎలక్ట్రిక్ ప్రజా రవాణా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థను వేగంగా విస్తరిస్తున్నట్లు చెప్పారు.
ప్రధానమంత్రి PM e-Bus Sewa పథకం కింద రాష్ట్రానికి తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరుకానుండగా, అందులో విశాఖపట్నానికి 100 బస్సులు కేటాయించినట్లు వెల్లడించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు నగరాల్లో దశలవారీగా ఈ-బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం సంస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అనంతరం డిపో కమిటీలు, కార్మిక సంఘాల ప్రతినిధులు మంత్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, డిపో మేనేజర్లు, ఉద్యోగులు, వివిధ ఆర్టీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



