Bapatla City News :బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. సామాజిక న్యాయంలో చారిత్రక ముందడుగు-బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట – హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

Sharat
1 View

బాపట్ల:- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత దిశగా చారిత్రక ముందడుగని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, మున్సిపాలిటీల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుతో ప్రజాస్వామ్య పాలనలో బీసీల భాగస్వామ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తోందని వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు. ఎన్టీఆర్ నాయకత్వంలో బీసీలకు రాజకీయ అధికారంలో సముచిత స్థానం కల్పించారని, అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు బీసీల అభ్యున్నతికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు.

కులవృత్తులు, చేతివృత్తులకు ప్రోత్సాహం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యాపార అవకాశాల కల్పనతో పాటు బీసీ వర్గాల యువత ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు. వసతిగృహాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు కూడా చర్యలు చేపడుతోందన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేవలం ఎన్నికల హామీ కాదని, బీసీలకు రాజకీయ సాధికారత కల్పించాలనే కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీసీలకు న్యాయం.. బీసీలకు అవకాశం.. బీసీలకు అధికారం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వేగేశన నరేంద్ర వర్మ రాజు స్పష్టం చేశారు.

Author
Share This Article
Leave a review