GUNTUR CITY NEWS: విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి

Karthik

నగరంలో కరెంటు తీగలకు అడ్డు వస్తున్నచెట్ల కొమ్మలను నరికిన అనంతరం,సదరు కొమ్మలను ప్రత్యేక వాహనం ద్వారా తొలగించాల్సిన బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు వారిపై ఉందని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం కమిషనర్ ఛాంబర్ నందు ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత నగరంలో చెట్ల కొమ్మలను నరికే బృందాలు ఎన్ని ఉన్నాయి, సదరు బృందాలు ఎక్కడెక్క పనిచేస్తుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు వారు కరెంటు తీగలకు అడ్డువస్తున్న కొమ్మలను ఇష్టానుసారంగా నరికి అక్కడే వదిలేస్తున్నారని ప్రజలు మరియు అధికారుల వద్ద నుండి అనేక పిర్యాదులు అందుతున్నాయన్నారు. నరికిన కొమ్మలను ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు వారే విధిగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి, తొలగించాలని వారికి స్పష్టం చేశారు. ఇక నుండి నగరంలో చెట్ల కొమ్మలను నరికే ముందు నగర పాలక సంస్థ అధికారులకు ముందుగా తెలియచేయాలని, సదరు ప్రాంతాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. భవిష్యత్ లో మరల చెట్ల కొమ్మలు కొట్టి రోడ్ల పై వేయటానికి వీలు లేదని, కొమ్మలను కొట్టిన అనంతరం వాటిని తొలగించుటకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలియచేశారు. సదరు సమావేశంలో ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు యస్.ఈ సి.హెచ్ రమేష్, ఈ.ఈ పఠాన్ హుస్సేన్ ఖాన్, జియంసి సియంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓడాక్టర్ సురేష్, ఎ.డి.హెచ్ శాంతి తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review