Guntur City News :స్కీమ్ వర్కర్లకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ డిమాండ్రెండో రోజు కలెక్టరేట్ ముట్టడి.. హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిక

Sharat
1 View

గుంటూరు, జూలై 31 (వార్త): రాష్ట్రంలోని అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, వీవోఏలు, ఆర్పీలు, స్కూల్ స్వీపర్లు తదితర ప్రభుత్వ స్కీమ్ వర్కర్లకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయడంతో పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తదితర సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో రోజు ఆందోళనలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు.

శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ జి. రమణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో కె. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేస్తున్న స్కీమ్ వర్కర్లకు న్యాయమైన వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వేతనాల పెంపు కోరితే ఖజానా ఖాళీగా ఉందని చెప్పే ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఎకరం భూమిని 99 పైసలకు ఎలా కేటాయిస్తోందని ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రకటిస్తున్న విజన్–2047 లక్ష్యాలపై స్పందిస్తూ, అప్పటి వరకు ప్రతి కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకులను ప్రభుత్వమే అందిస్తే కార్మికుల తరఫున వేతనాల పెంపు కోరబోమని వ్యాఖ్యానించారు. లేదంటే తక్షణమే రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీల 42 రోజుల సమ్మె సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. గత ఏడు సంవత్సరాలుగా స్కీమ్ వర్కర్ల వేతనాలు పెరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఈ అంశంపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రూ.3 వేలతో, ఆర్పీలు రూ.6 వేలతో, యానిమేటర్లు, ఆశా వర్కర్లు రూ.10 వేలతో, అంగన్వాడీ హెల్పర్లు రూ.7 వేలతో, అంగన్వాడీ వర్కర్లు రూ.11,500తో కుటుంబాలను ఎలా పోషించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏవీఎన్ కుమారి మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం, పెన్షన్, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. 2024లో జరిగిన 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. నవచేతన యాప్ కారణంగా అదనపు పనిభారం, మానసిక ఒత్తిడి పెరిగిందన్నారు.

ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ పరిమితి పెంపు, అన్ని రకాల సెలవుల అమలు, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాల పెంపు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, అదే సమయంలో స్కీమ్ వర్కర్ల వేతనాలు పెరగక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేకమని ఆరోపించారు. ఐసీడీఎస్‌కు నిధుల కోత విధించడం వల్ల పేద గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమం దెబ్బతింటోందన్నారు.

ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్. అరుణ మాట్లాడుతూ యాప్‌ల పేరుతో అంగన్వాడీలపై అదనపు భారం మోపుతున్నారని, స్కీమ్ వర్కర్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వేతనాల సాధనకు ఐక్య పోరాటమే మార్గమని పేర్కొంటూ ఐద్వా పూర్తి మద్దతు ప్రకటించింది.

ధర్నా అనంతరం స్కీమ్ వర్కర్లు భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని నినాదాలు చేస్తూ ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అశుతోష్ మిశ్రా ఆందోళనకారుల వద్దకు చేరుకుని వినతిపత్రాన్ని స్వీకరించారు. స్కీమ్ వర్కర్లు తమ సమస్యలను వివరించగా, వారి సేవలు ప్రభుత్వానికి ఎంతో విలువైనవని అభినందించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల అంశాలను కలెక్టర్‌తో చర్చించి చర్యలు తీసుకుంటామని, విధానపరమైన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శులు వై. నేతాజీ, బి. ముత్యాలరావు, ఎన్. శివాజీ, ఉపాధ్యక్షులు కె. శ్రీనివాసరావు, షేక్ హుస్సేన్ వలి, కె. బాబు ప్రసాద్, వేముల దుర్గారావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, నాయకులు రేణుక, జ్యోతి, లక్ష్మి, ప్రమీల, సుజాత, అంగన్వాడీ యూనియన్ నాయకులు అస్మత్ తారా, శివలీల, పార్వతి, కనకవల్లి, అన్నామణి, రాజకుమారి, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి షమీ, ఆర్పీ జిల్లా కార్యదర్శి రమాదేవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సమీర్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ. చిష్టీ, ప్రజానాట్యమండలి నాయకులు ఎస్. పద్మ, ఆర్.వి. రాఘవయ్య, సీఐటీయూ నాయకులు రమేష్‌బాబు, పల్లె కృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review