గుంటూరు నగరాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో శిల్పారామం వద్ద నిర్వహించిన ‘గ్రీన్ గుంటూరు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణతో కలిసి ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పాల్గొని మొక్కలు నాటి, కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తొలి ఏకాదశి పర్వదినాన గ్రీన్ గుంటూరు కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. గుంటూరును మరింత పచ్చదనంతో నింపి, పరిశుభ్రమైన పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
గ్రీన్ గుంటూరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్‌లను ఎమ్మెల్యే అభినందించారు. ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్, డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యారావు, మున్సిపల్ శాఖ అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



