అమరావతి, జూన్ 19:– రాష్ట్రంలో భూములపై ప్రజల హక్కులను పరిరక్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామని, ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు.
శుక్రవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత రెండేళ్లలో తమ శాఖ సాధించిన ప్రగతి, అమలు చేసిన సంస్కరణల వివరాలను ఆయన మీడియాకు వివరించారు.
ప్రజా అనుకూల భూ పరిపాలనే లక్ష్యం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో భూ పరిపాలన వ్యవస్థను సమూలంగా ఆధునీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూముల యాజమాన్య హక్కులపై ప్రజల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళనలను పూర్తిగా తొలగించి, భూమిపై నమ్మకాన్ని పునరుద్ధరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
వివాదాల పరిష్కారం – రీ-సర్వేకు నూతన దిశ
గతంలో చేపట్టిన రీ-సర్వేపై వచ్చిన వేలాది ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా:
- ప్రతి గ్రామంలో ప్రత్యేక సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం.
- ప్రతి నెల 9వ తేదీన గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, నేరుగా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నాం.
- రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.04 లక్షల ఎకరాలకు సంబంధించిన పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాం.
24 లక్షల పైగా ఆధునిక పాస్బుక్కుల జారీ
భూ హక్కుల భద్రత కోసం ఇప్పటివరకు 24 లక్షల పైగా కొత్త పట్టాదారు పాస్‌బుక్కులను జారీ చేశామని, త్వరలోనే మరో 1.90 లక్షల పాస్‌బుక్కులను పంపిణీ చేయనున్నామని మంత్రి తెలిపారు. నకిలీలను అరికట్టేందుకు వీటిని QR కోడ్ ఆధారిత ఆధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు పేర్కొన్నారు.
డిజిటల్ భూ భద్రత – ఆటో మ్యూటేషన్
భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, రికార్డుల ట్యాంపరింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతికతను జోడించినట్లు మంత్రి వివరించారు.
- డిజిటల్ లాకింగ్ & OTP వ్యవస్థ: భూ యజమాని అనుమతి లేకుండా ఆస్తి బదిలీ కాకుండా ‘డిజిటల్ లాకింగ్’, అలాగే ప్రతి రిజిస్ట్రేషన్‌కు OTP ధృవీకరణను తప్పనిసరి చేశాం.
- ఆటో మ్యూటేషన్: రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే స్వయంచాలకంగా మ్యూటేషన్ అయ్యేలా ఆటో మ్యూటేషన్ విధానాన్ని తెచ్చాం. దీనివల్ల ప్రజలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
- బ్లాక్‌చెయిన్ సాంకేతికత: రికార్డుల భద్రత కోసం రిజిస్ట్రేషన్ శాఖలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాం. వాట్సాప్ ద్వారా కూడా భూ వివరాల స్థితిని తెలుసుకునే వీలు కల్పించాం.
భూ మాఫియాపై ఉక్కుపాదం
భూ ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే పలు కేసుల్లో CID విచారణ ప్రారంభమైందని, ఒక డిప్యూటీ కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, కొందరిని అరెస్ట్ కూడా చేశామని వెల్లడించారు. “భూమిపై సంపూర్ణ హక్కు ప్రజలదే, ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. గత ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద భూ చట్టాలను రద్దు చేశాం” అని మంత్రి స్పష్టం చేశారు.
₹23 లక్షల కోట్ల పెట్టుబడులు
పారదర్శక భూ విధానాల వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని, గత రెండేళ్లలో రాష్ట్రానికి ₹23.00 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే ₹11.00 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవ్వగా, 10 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ తరపున:
- పరిశ్రమల శాఖకు: 12,142 ఎకరాలు
- పునరుత్పాదక ఇంధన (Renewable Energy) సంస్థలకు: 40,000 ఎకరాలు
- పర్యాటక రంగానికి: 470 ఎకరాలు కేటాయించినట్లు వివరించారు. విశాఖ, తిరుపతి, అమరావతి, శ్రీకాకుళం, అనంతపురం పరిసరాల్లో భారీ పెట్టుబడులకు అనువైన భూ వనరుల మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు.
పేపర్‌లెస్ రెవెన్యూ సేవలే లక్ష్యం
భవిష్యత్తులో రెవెన్యూ సేవలను పూర్తిగా ‘పేపర్‌లెస్’ (కాగిత రహిత) విధానంలోకి తీసుకువచ్చి, అవినీతి రహిత సేవలను ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ముగించారు.
ఈ విలేకరుల సమావేశంలో సిసిఎల్ఏ జి. జయలక్ష్మి, రిజిస్ట్రేషన్స్ & స్టాంప్స్ ఐజీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, సర్వే అండ్ సెటిల్మెంట్స్ సంచాలకులు ఆర్. కూర్మనాథ్, సిసిఎల్ఏ జాయింట్ సెక్రటరీ టి.ఎస్. చేతన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



