AMARAVATHI NEWS :మహాబలిపురం వేదికగా 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ-హాజరుకానున్న సీఎం చంద్రబాబు

Sharat
1 View

అమరావతి, ఆగస్టు 19:– తమిళనాడులోని చారిత్రాత్మక ప్రాంతమైన మహాబలిపురం వేదికగా గురువారం అత్యంత కీలకమైన 31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ ఉన్నత స్థాయి సమావేశానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ముఖ్యమంత్రులు మరియు పుదుచ్చేరి సీఎం హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు పావులు కదపనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 ఏళ్లు కావస్తున్నా ఇంకా పెండింగ్‌లోనే ఉన్న కీలక అంశాలను ఆయన కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, ఆస్తులు-అప్పుల ఖరారు, రెవెన్యూ లోటు భర్తీ వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. విభజన చట్టంలోని హామీల అమలును వేగవంతం చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలని ఆయన కోరనున్నారు.

కేంద్రం దృష్టికి కీలక ప్రాజెక్టులు.. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ఈ భేటీలో సీఎం నివేదిక అందించనున్నారు. ముఖ్యంగా దుగరాజుపట్నం పోర్టు ఏర్పాటు, విశాఖపట్నం-విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు, నూతన రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయాల విస్తరణ మరియు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి తక్షణ నిధులు, అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.

మరోవైపు, విశాఖపట్నం కేంద్రంగా ‘సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌’ ఏర్పాటు ప్రక్రియ మరియు జాతీయ ప్రాజెక్టైన పోలవరానికి అందుతున్న కేంద్ర సహకారంపై ఈ వేదికగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపనున్న సీఎం చంద్రబాబు.. మిగిలిన ప్రాజెక్టులనూ వేగవంతం చేయాలని కేంద్రాన్ని గట్టిగా కోరే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగనున్న ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Author
Share This Article
Leave a review