అమరావతి, ఆగస్టు 21:– ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘షావుకారు’ జానకి మృతి పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.
‘షావుకారు’ చిత్రంతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జానకి, అనంతరం ‘షావుకారు జానకి’గా విశేష గుర్తింపు పొందారని మంత్రి తెలిపారు. రాజమహేంద్రవరంలో జన్మించిన ఆమె దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి, విభిన్న పాత్రలకు సహజమైన అభినయంతో జీవం పోశారని గుర్తుచేశారు.
తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న షావుకారు జానకి తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేశారని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆమె మృతి సినీ రంగానికి, అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
షావుకారు జానకి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన మంత్రి, ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.



