విజయవాడ, ఆగస్టు 21:– ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMDC)కు ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ అవార్డు లభించింది. ముంబైలో ఆగస్టు 20న నిర్వహించిన ASSOCHAM IX National Summit & Awards on Corporate Bond Market కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.
కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా సెక్యూర్డ్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్ (NCDs) జారీ చేసి రూ.9,000 కోట్లను విజయవంతంగా సమీకరించినందుకు APMDCకి ఈ గుర్తింపు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఇంత భారీ స్థాయిలో నిధులను సమీకరించడం సంస్థకు కీలక మైలురాయిగా నిలిచింది.
APMDC మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, IAS నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ బాండ్ జారీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. భారీ స్థాయిలో ఆర్థిక వనరులను సమీకరించగల సామర్థ్యంతో పాటు పటిష్ఠమైన ఆర్థిక నిర్వహణ, సమర్థవంతమైన పరిపాలన, నియంత్రణ నిబంధనల అనుసరణ, పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్ వంటి అంశాలు ఈ లావాదేవీలో ప్రతిబింబించాయని సంస్థ తెలిపింది.
అవార్డు ఎంపికలో గవర్నెన్స్, నియంత్రణ నిబంధనల అనుసరణ, పరిపాలనా సామర్థ్యం, ఆవిష్కరణలు, వ్యూహాత్మక కార్యక్రమాలు, కార్యాచరణ సామర్థ్యం, పరిశ్రమ అభివృద్ధికి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రాథమిక మూల్యాంకనం అనంతరం నియంత్రణ, ఆర్థిక, కార్పొరేట్ రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన ఏడుగురు సభ్యుల స్వతంత్ర జ్యూరీ ప్యానెల్ తుది ఎంపిక చేపట్టింది.
ఈ సందర్భంగా APMDC రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఆర్థిక శాఖ, పరిశ్రమలు–వాణిజ్యం, గనులు–భూగర్భశాస్త్ర శాఖలతో పాటు బాండ్ జారీకి సహకరించిన ఇతర సంస్థలు, ఏజెన్సీలకు ధన్యవాదాలు తెలిపింది.
ఈ విజయాన్ని సంస్థ సమష్టి కృషికి దక్కిన గౌరవంగా APMDC అభివర్ణించింది. సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, ఉద్యోగులు, బ్యాంకర్లు, అరేంజర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, డిబెంచర్ ట్రస్టీ, స్టాక్ ఎక్స్చేంజ్ తదితర భాగస్వాముల సహకారాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది.
‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ అవార్డు APMDC ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, సుపరిపాలన, నియంత్రణ నిబంధనల అనుసరణకు గుర్తింపుగా నిలిచిందని సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఖనిజ రంగ సుస్థిర అభివృద్ధితో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింతగా తోడ్పడేందుకు ఈ గుర్తింపు ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపింది.



